వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని బద్వేల్ మున్సిపాలిటీ 22వ వార్డుకు చెందిన 40 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరగా, ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంచూరు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై విశ్వాసంతో అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే పార్టీకి ప్రజాదరణ పెరగడానికి కారణమని ఆయన అన్నారు.
పార్టీలో చేరిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ, గ్రామాభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొత్తగా పార్టీలో చేరిన కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.