ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంట్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆగస్టు 1న జరగనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానిని ఆహ్వానించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, కేంద్ర-రాష్ట్ర సమన్వయంపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ బృందం పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఆక్వా రైతులు, రొయ్యల దాణా తయారీదారులు, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ రంగాల అభివృద్ధికి అవసరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు రైతులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాల పురోగతికి కేంద్ర సహకారం కీలకమని ఆయన ఈ సందర్భంగా వివరించారు.