ప్రస్తుతం ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత కారణాలు వంటి అనేక అంశాలు చాలా మందిలో మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి అనేది దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. కొద్దిపాటి ఒత్తిడి సహజమే అయినప్పటికీ, అది ఎక్కువకాలం కొనసాగితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. నిద్రలేమి, తరచుగా తలనొప్పి, అలసట, ఆకలి తగ్గడం లేదా ఎక్కువగా తినడం, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరిపడ నిద్ర, క్రమమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, ధ్యానం వంటి అలవాట్లు ఎంతో ఉపయోగపడతాయి. ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తే కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటం లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.