గ్లోబల్ వార్మింగ్ విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ ప్రపంచానికి ప్రధాన రక్షణ కవచంగా నిలిచే ఆమజాన్ వర్షాధార అడవులు మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్నాయి. గతంలో విస్తృతంగా చెలరేగిన కార్చిచ్చుల కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూసిన ఈ అడవులు తాజాగా చారిత్రాత్మక స్థాయిలో కోలుకున్నట్లు పర్యావరణ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఎన్విరాన్‌మెంటల్ మానిటరింగ్ నెట్‌వర్క్ ‘మ్యాప్‌బయోమాస్’ ఉపగ్రహ గణాంకాల ప్రకారం, గత ఏడాది ఆమజాన్ ప్రాంతంలో తగలబడిన అటవీ విస్తీర్ణం 3.1 మిలియన్ హెక్టార్లకు, అంటే సుమారు 7.7 మిలియన్ ఎకరాలకు పడిపోయింది. ఇది 1985లో గ్లోబల్ ఉపగ్రహ రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి నమోదైన అత్యంత తక్కువ స్థాయి.
అంతేకాకుండా, 2018 తర్వాత కూడా కార్చిచ్చుల తీవ్రత అత్యల్ప స్థాయికి చేరుకోవడం పర్యావరణవేత్తలకు ఆశాజనకంగా మారింది. ఆమజాన్ అడవుల పునరుద్ధరణ గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కొనే ప్రపంచ ప్రయత్నాలకు కీలక మద్దతుగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.