ఒకే పోలికలతో నలుగురు శిశువులు.. ఆస్ట్రేలియాలో అరుదైన వైద్య అద్భుతం

వైద్య చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టం ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. దాదాపు 1 కోటి 50 లక్షల కేసుల్లో ఒక్కసారి మాత్రమే సంభవించే అవకాశమున్న ఈ ఘటనలో, ఒకే ఫలదీకరణ చెందిన అండం నాలుగు భాగాలుగా విడిపోయి ఒకే పోలికలతో ఉన్న నలుగురు ఆడ శిశువులు జన్మించారు.

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరానికి చెందిన 34 ఏళ్ల జెనిటార్ నామోనా జూలై 14న రాయల్ బ్రిస్బేన్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌లో సిజేరియన్ ద్వారా ఈ నలుగురు శిశువులకు జన్మనిచ్చారు. సహజ సిద్ధంగా గర్భం దాల్చి, ఒకే రకమైన పోలికలతో నలుగురు పిల్లలు పుట్టడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది.

వైద్యుల వివరాల ప్రకారం, ఇది ఆస్ట్రేలియా చరిత్రలోనే తొలిసారి నమోదైన ఘటన. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి కేసులు కేవలం రెండు మాత్రమే నమోదయ్యాయని వారు తెలిపారు. ఈ అరుదైన జననం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.