ప్లాస్టిక్ రహిత జనగామ కోసం బతుకమ్మ కుంటలో అవగాహన కార్యక్రమం

జనగామ జిల్లా కేంద్రంలోని దుర్గమ్మ గుడి సమీపంలోని బతుకమ్మ కుంట ప్రాంతంలో వాయిస్ ఆఫ్ ఫౌండేషన్ అధ్యక్షులు మంగళంపల్లి రాజు ఆధ్వర్యంలో ‘ప్లాస్టిక్ రహిత బతుకమ్మ కుంట – ప్లాస్టిక్ రహిత జనగామ’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, వాకర్స్ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 29వ వార్డు మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్ మాట్లాడుతూ, బతుకమ్మ కుంట ప్రాంతం నుంచే ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇది జనగామ పట్టణమంతా వ్యాప్తి చెంది ప్లాస్టిక్ రహిత జనగామగా మారాలని ఆకాంక్షించారు.

ప్రజలు కూరగాయలు, బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో ప్లాస్టిక్ కవర్లకు బదులుగా వస్త్రంతో తయారుచేసిన క్లాత్ బ్యాగులను వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నివారించి భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ప్లాస్టిక్ రహిత జనగామ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.