బోధన్ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డీవో విజయ కుమారి

బోధన్ పట్టణంలోని బాలికల కళాశాల వసతి గృహంతో పాటు ఎస్సీ, బీసీ వసతి గృహాలను బోధన్ ఆర్డీవో విజయ కుమారి మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లోని సౌకర్యాలు, విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతపై ఆమె ఆరా తీశారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. అలాగే బాలికల వసతి గృహాల్లో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

వార్డెన్లు ఎల్లప్పుడూ విద్యార్థులకు అందుబాటులో ఉండాలని ఆర్డీవో విజయ కుమారి ఆదేశించారు. వసతి గృహాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ తనిఖీల్లో ఆమె వెంట తహసీల్దార్ విట్టల్ కూడా పాల్గొన్నారు.