కాంగ్రెస్ మాటలు కోటలు దాటుతున్నాయి.. పనులు గడప దాటడం లేదు: కేటీఆర్

కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని, కానీ పనులు మాత్రం గడప కూడా దాటడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.

తెలంగాణ భవన్‌లో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని, అందుకే ప్రజలు బీఆర్ఎస్ వైపు తిరిగి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.