కలలపై రాజీ పడొద్దు.. లక్ష్యం చేరేవరకు శ్రమించండి: కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

కడపలోని మాధవి కన్వెన్షన్ హాలులో 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో జిల్లా స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్-2026’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఘన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు రూ.20 వేల నగదు బహుమతి, సర్టిఫికేట్‌లు, మెడల్స్ అందజేశారు.

జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ, విద్యార్థులు తమ కలలు మరియు జీవిత లక్ష్యాలపై ఎప్పుడూ రాజీ పడకూడదని, అవి నెరవేరే వరకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కష్టపడే విద్యార్థులు తప్పకుండా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లాలో 33 మంది ఇంటర్ విద్యార్థులు, 248 మంది టెన్త్ విద్యార్థులు కలిపి మొత్తం 281 మందికి రూ.56,20,000లను విడుదల చేశారు. ఒక్కొక్క విద్యార్థికి రూ.20 వేలు చొప్పున బహుకరించి వారి ప్రతిభను ఘనంగా సత్కరించారు.