ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణ కేబినెట్ ఆందోళన.. జిల్లాల వారీగా నివేదికలకు ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఎల్‌నినో ప్రభావంపై విస్తృతంగా చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచించిన నేపథ్యంలో, నీటి వనరులు, వర్షపాతం పరిస్థితులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. నీటి నిర్వహణ, సాగునీటి అవసరాలు, తాగునీటి సరఫరా వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు.

ఈ నెల 20న జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహించి జిల్లాల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని జిల్లాల నుంచి నివేదికలు అందిన అనంతరం పరిస్థితిని సమీక్షించి తదుపరి చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.