మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. Petrol, Diesel అమ్మకాలపై ఆంక్షలు.. రోజుకు ఎన్ని లీటర్లు అంటే..?

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా చూసేందుకు, ఇంధన అక్రమ మళ్లింపులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ తాజాగా ‘మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ ఆర్డర్–2026’ పేరిట కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరా గొలుసులో తలెత్తిన ఒడిదొడుకులు, మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా మోదీ సర్కార్ ఈ సంచలన ఆంక్షలను విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కొత్త నిబంధనల ప్రకారం, సాధారణ వినియోగదారుల కోసం కేటాయించిన రిటైల్ పెట్రోల్ బంకుల్లో ఇంధన బల్క్ (భారీ) కొనుగోళ్లపై పూర్తిగా నిషేధం విధించారు. పారిశ్రామిక, వాణిజ్య, మరియు వివిధ సంస్థాగత (Institutional) వినియోగదారులు ఇకపై ఆర్డినరీ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి వీల్లేదు. వారు తమ అవసరాల కోసం నిర్దేశించిన బల్క్ సరఫరా ఛానళ్లు లేదా సొంత కన్స్యూమర్ పంపుల ద్వారానే ఇంధనాన్ని పొందాల్సి ఉంటుంది. అలాగే, రిటైల్ బంకుల్లో ఒక వినియోగదారుడికి లేదా ఒక వాహనానికి ఒక రోజుకు గరిష్ఠంగా 200 లీటర్లకు మించి డీజిల్‌ను విక్రయించకూడదని కేంద్రం గట్టి నిబంధన పెట్టింది.

బంకుల్లో కొనుగోలు చేసిన డీజిల్‌ను తిరిగి విక్రయించడం (Resale) కూడా చట్టవిరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆంక్షలు తక్షణమే అమలులోకి రానుండగా, ప్రారంభ దశలో గరిష్ఠంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని, అవసరమైతే గడువు పొడిగిస్తామని అధికారులు తెలిపారు. బల్క్ ధరల కంటే రిటైల్ ధరలు తక్కువగా ఉండటంతో పరిశ్రమలు బంకులను ఆశ్రయించి కృత్రిమ కొరత సృష్టించకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నిత్యవసర వస్తువుల చట్టం-1955 కింద కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై గట్టి నిఘా ఉంచాలని కేంద్రం ఆదేశించింది.