ఇంట్లో విలువైన వస్తువులు, నగలను దాచుకోవడానికి ఎంత పటిష్టమైన లాకర్లు ఏర్పాటు చేసుకున్నా.. చిన్న అజాగ్రత్త ఎంతటి భారీ నష్టానికి దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. ఇంట్లోని పూజా గదిలో ఉన్న కలశం చెంబులో బీరువా తాళం చెవిని దాచిపెట్టడమే యజమానులకు శాపంగా మారింది. ఇల్లు ఖాళీగా ఉన్న సమయం చూసి లోపలికి ప్రవేశించిన దొంగలు, పూజా గదిని వెతకగా వారికి సులువుగా తాళం చెవి దొరికిపోయింది. దాంతో ఎలాంటి శబ్దం కాకుండా, బీరువాలను పగులగొట్టే అవసరం లేకుండానే లోపల ఉన్న భారీ మొత్తంలో నగలను దోచుకెళ్లారు.
ఈ చోరీలో బాధితులు ఏకంగా 7.8 కిలోల బంగారు ఆభరణాలు, కేజీన్నర వెండి వస్తువులను కోల్పోయారు. దొంగలు బీరువా తెరిచి అందులో ఉన్న ప్రతీ విలువైన వస్తువును బ్యాగుల్లో సర్దుకుని దర్జాగా పరారయ్యారు. యజమానులు తిరిగి వచ్చి చూసేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉండటం, తాళం చెవి ఉండాల్సిన చోట లేకపోవడంతో షాక్కు గురయ్యారు. బీరువా తెరిచి చూడగా అందులోని కోట్లాది రూపాయల విలువైన బంగారం, వెండి మాయమవడంతో తలబాదుకున్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్ ద్వారా వేలిముద్రలను సేకరించారు. ఇళ్లలో తాళాలు ఎక్కడో ఒకచోట దాచడం దొంగలకు సులువుగా మారుతోందని, ఇలాంటి అజాగ్రత్తల వల్లే నేరస్థులు పని సులువు అవుతోందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే దొంగలను పట్టుకుని రికవరీ చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.