ఆర్టీసీలో సమ్మె సైరన్..! ఎప్పటినుండి అంటే..?

ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 21 అర్ధరాత్రి..22 (బుధవారం)నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మార్చి 13న సమ్మె నోటీసు లు ఇచ్చామని ప్రభుత్వం నుంచి గానీ, ఆర్టీసీ యాజమాన్యం నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదని జేఏసీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం, యాజమాన్యం ముందు 31 డిమాండ్లను పెట్టామని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డిలు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానాంగా జీత భత్యాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్లు ఉన్నట్లు తెలిపారు.

 

మహిళలకు కార్డులు..

సోమవారం కార్మికశాఖ కార్యాలయంలో జేఏసీ నాయకులు జరిపిన చర్చలు విఫలం కావడం తోనే సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. 2021, 2025 జీత భత్యాల సవరణ, కండక్టర్, డ్రైవర్ల ఉద్యోగ భద్రత, ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వమే ఆర్టీసీకి కొని ఇవ్వాలని, పీఎఫ్, సీసీఎష్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ఉద్యోగులకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, 2017 నుంచి అలవెన్స్లు, ప్రింజ్ బెనిఫిట్స్ పెంచాలని, వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు సైతం వేతన సవరణ చేయాలని కోరారు. మహాలక్ష్మి పథకంలో జీరో టికెట్ బదులు మహిళలకు టికెట్ లెస్ స్మార్ట్ కార్డు ఇవ్వాలని, రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని, ఈ పథకం కింద ఇవ్వాల్సిన 400కోట్లు ప్రతి నెల కోత విధించకుండా ఇవ్వాలని, పాత బకాయిలు 2500కోట్లు వెంటనే చెల్లించాలని, ప్రస్తుతం కన్సాలిడేటెడ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు.

 

తార్నాక ఆసుపత్రిలో..

ప్రభుత్వ జీవో ఎంఎస్ నెంబర్ 30 ప్రకారం వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలని, ఈ స్కీంలో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ వంటి పోస్టులను కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేసి అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు తార్నాక ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యం కల్పిస్తూ ఉద్యోగి ఫ్యామిలీతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో వారి తల్లిదండ్రులకు కూడా వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 2019లో సమ్మెకాలంలో ఉద్యోగులపై కేసు నమోదు చేసిన పోలీస్ కేసులు ఎత్తేయాలని, మహిళా కండాక్టర్లకు రాత్రి 8 లోపు పూర్తయ్యేలా డ్యూటీలు ఇవ్వాలని, టీజీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని ఏపీఎస్ ఆర్టీసీకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *