కొత్త ట్యాక్స్ విధానంతో బెనిఫిట్స్ ఎవరికి..?

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ఈ రోజు కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఎప్పట్లాగే బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమైన ధరలు, ఆదాయ పన్ను వివరాలను చాలా మంది ఆసక్తిగా చూశారు. ముఖ్యంగా వేతన జీవులు కొత్త ఆదాయ పన్ను, అందులో జరిగిన మార్పులను పరిశీలించారు. ఈ కొత్త పన్ను విధానంలో ఎవరికి ప్రయోజనాలు దక్కనున్నాయి? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో గత ఏడాది పన్నుల విధానం ఎలా ఉంది? ఇప్పుడు జరిగిన మార్పులు ఏమిటీ? ఈ మార్పులతో ఎవరికి బెనిఫిట్? వంటి వివరాలను చర్చిద్దాం.

 

గతేడాది ఆదాయ పన్నుల శ్లాబ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. మూడు లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు వార్షిక ఆదాయం చేసేవారు 5 శాతం ఐటీ కట్టాల్సి ఉండేది. రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు 10 శాతం ఆదాయ పన్ను కట్టాలి. ఇక రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఆదాయం ఆర్జించే వారు రూ. 15 శాతం ఐటీ కట్టాలి. రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఆదాయం పొందేవారు 20 శాతం ఐటీ కట్టాల్సి ఉండేది. ఇక రూ. 15 లక్షలకు ఎక్కువ వార్షికాదాయము ఉన్నవారు దానిపై 30 శాతం ఐటీ కట్టాలని గతేడాది కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది.

 

ఈ సారి ఈ పన్ను విధానంలో మార్పులు జరిగాయి. కొత్త విధానంలో శ్లాబులు మారాయి. రూ. 3 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఐటీ నుంచి మినహాయింపు ఎప్పట్లాగే ఉన్నది. తర్వాతి శ్లాబులో రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఆదాయమున్న వారు 5 శాతం పన్ను కట్టాలి.అంటే.. ఈ శ్లాబులో రూ. 7 లక్షల ఆదాయమున్నవారినీ చేర్చారు. తద్వార రూ. 7 లక్షల ఆదాయమున్నవారికి ప్రయోజనం కలగనుంది. గతంలో వీరు 10 శాతం పన్ను కట్టాల్సి ఉండగా.. ఈ సారి 5 శాతమే కట్టాలి. ఆ తర్వాతి శ్లాబులోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. గతంలో రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు ఆదాయమున్న వారు 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా.. ఈ సారి ఈ శ్లాబులో రూ. 10 లక్షల వార్షికాదాయం ఉన్నవారినీ చేర్చారు. తద్వార రూ. 10 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి ప్రయోజనం చేకూరనుంది. వారు గతంలో 15 శాతం పన్ను కట్టగా.. ఈ సారి వారు 10 శాతమే పన్ను కట్టాలి. ఆ తర్వాతి శ్లాబుల్లో మార్పులు లేవు.

 

ఇక బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వేతన జీవులు, పెన్షనర్లకు సంబంధించి రెండు కీలక ప్రకటనలు చేశారు. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంచాలని నిర్ణయించామని, దీని ద్వారా పెన్షనర్ కుటుంబ పెన్షన్‌ డిడక్షన్‌ను రూ. 15 వేల నుంచి రూ. 20 వేలకు పెంచుతున్నామని చెప్పారు. ఈ నిర్ణయాలు సుమారు నాలుగు కోట్ల వేతన జీవులకు, పెన్షనర్లకు లబ్ది చేకూరనుందని ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *