యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్ అన్న మోదీ.. కాపీ పేస్ట్ అంటూ రాహుల్ కామెంట్..!

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్ అని అన్నారు. అణగారిన వర్గాలు, దళితులకు శక్తిని ఇచ్చే బడ్జెట్‌ అని అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసామన్న ఆయన.. చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కొత్త పథకాలు తీసుకువచ్చామని అన్నారు. ఎంప్లాయ్‌మెంట్ లింక్‌డ్ స్కీమ్ ద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలు వేయడమే కాకుండా స్వయం ఉపాధికి ప్రధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా చేస్తామని తెలిపారు.

 

ఈ బడ్జెట్‌తో మా ప్రభుత్వం ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. ఇది అనేక ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు దోహద పడుతుంది. ఈ పథకం క్రింద కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి మొదటి వేతనాన్ని ప్రభుత్వమే ఇస్తుంది. నైపుణ్యాభివృద్ధికి మద్దతు ఇవ్వడమే కాకుండా ఇంటర్న్ షిప్ ద్వారా కోటి మంది యువతకు పెద్ద కంపెనీల్లో పని చేసేందుకు అవకాశం లభిస్తుంది. గ్రామాల నుంచి మహానగరాల వరకు అందరినీ వ్యాపారవేత్తలను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. ముద్ర యోజన రుణాలను రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచాం అని నరేంద్ర మోదీ అన్నారు.

 

ఇది గత బడ్జెట్‌‌కు కాపీ పేస్ట్:

ఇదిలా ఉంటే మరో వైపు బడ్జెట్‌‌పై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇది కుర్చీ బచావో బడ్జెట్‌ అంటూ ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మిత్ర పక్షాలను బుజ్జగించేందుకు ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను ప్రక్కన పెట్టి వారికి వరాలు కురిపించారని ఆరోపించారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపశమనం ఇవ్వకుండా, ఆశ్రిత పెట్టుబడుదారులకు హామీలు ఇచ్చారని విమర్శించారు. ఇది గత బడ్జెట్ కాపీ పేస్ట్ అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

 

ఈ బడ్జెట్ దేశ అభివృద్ధి కోసం కాకుండా మోదీ ప్రభుత్వానికి కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రవేశపెట్టారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ న్యాయ్ పత్రను కాపీ కొట్టారని, కానీ అది కూడా సరిగ్గా చేయలేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగం సమస్యను ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. మూడు ఉద్యోగ కల్పన ఆధారిత పథకాలను ఆవిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన మేరకు ఈ విధంగా స్పందించారు. ఈ విషయంలో ఇప్పటికే చాలా సమయాన్ని వృధా చేశారని అన్నారు. తాము న్యాయ్ పత్రాల్లో పేర్కొన్న ఇన్‌టర్న్ షిప్ పథకానికి మార్పులు చేర్పులు చేసి ప్రకటించారని ఆరోపించారు. 2018లో ప్రత్యేక హోదా విషయంపై ఎన్డీఏ కూటమి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ, తాజాగా అమరావతి మాత్రమే ప్రత్యేక ప్యాకేజీ సాధించగలిగిందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *