వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేస్తే భారీ జరిమానాలు!

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. కొందరు వాహనదారులు టోల్ చెల్లింపుల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్లలోని అంకెలను దాచడం, మార్చడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా బారియర్‌లెస్ టోల్ విధానం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది.

నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసిన వాహనాలు పట్టుబడితే సాధారణ టోల్ ఛార్జీ కంటే నాలుగు నుంచి ఎనిమిది రెట్ల వరకు జరిమానా విధించే ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం నేషనల్ హైవే ఫీజు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ జరిమానాలు మోటారు వాహనాల చట్టం కింద విధించే శిక్షలకు అదనంగా ఉంటాయి.

ప్రస్తుతం మోటారు వాహనాల చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌తో ట్యాంపరింగ్ చేసిన మొదటి తప్పిదానికి రూ.5,000, తదుపరి ఉల్లంఘనలకు రూ.10,000 జరిమానా విధించే నిబంధన ఉంది. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే నంబర్ ప్లేట్లను మార్చడం ద్వారా టోల్ చెల్లింపులు ఎగ్గొట్టే వారికి మరింత ఆర్థిక భారం తప్పదు. ఈ నేపథ్యంలో వాహనదారులు నిబంధనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.