జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించే వరకు రోజూ నిరసనలు.. సీజేపీ సంచలన ప్రకటన..!

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించే వరకు రోజూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌కు ర్యాలీగా వెళ్తామని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ), పలు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. శనివారం ఢిల్లీలో 1,500 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశాయి. ఓట్ల చోరీ, అధికార బీజేపీతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలపై జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని లేదా ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

జంతర్‌మంతర్‌ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేతో పాటు ఆ పార్టీ నేతలు ఆశుతోష్‌ రంకా, సౌరవ్‌ దాస్‌ కూడా నిర్బంధంలో ఉన్నారు. విమానం ఢిల్లీకి చేరుకున్న వెంటనే దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీజేపీ నేతలు ఆరోపించారు. ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

దీప్కే తరఫున నిరసనకు నాయకత్వం వహిస్తున్న అజింక్య షిండే మాట్లాడుతూ.. జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించే వరకు రోజూ జంతర్‌మంతర్‌కు ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీప్కే నానమ్మ మహారాష్ట్రలో మరణించారని, ఆమె అంత్యక్రియలకు వెళ్లేందుకు కూడా ఆయనను అనుమతించడం లేదని సీజేపీ నేతలు ఆరోపించారు. అయితే, అంత్యక్రియలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తామని దీప్కేకు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.

‘స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎస్‌ఎఫ్‌ఐ) ప్రధాన కార్యదర్శి సృజన్‌ భట్టాచార్య ఆదివారం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు నిరసనలు చేపడతారని తెలిపారు. పోలీసులు ఎక్కడ అడ్డుకున్నా అక్కడే శాంతియుతంగా నిరసన కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు.

మరోవైపు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి సోమవారం నిరసనకు పిలుపునిచ్చింది. కూటమి నేతలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా, ఎన్నికల కమిషనర్లకు జీవితకాల రక్షణ కల్పించే 2023 చట్టం రద్దు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) నిలిపివేత, తొలగించిన 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్లను తిరిగి చేర్చడం వంటి డిమాండ్లను కూటమి ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అందించిన వినతిపత్రంలో పేర్కొంది. ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్లను తిరిగి ప్రవేశపెట్టాలని, ఓట్ల చోరీకి ఆధారాలు ఉన్న గత రెండేళ్ల అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని కూడా కోరింది.