ఢిల్లీ రాజకీయం మరోసారి వేడెక్కింది. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ తీరుపై మండిపడుతూ ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
గత దశాబ్ద కాలానికి పైగా తాను నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్, వారి అనుబంధ సంస్థల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని రాహుల్ స్పష్టం చేశారు. ఎవరైనా తమ ప్రత్యర్థులను ఎంత లోతుగా విశ్లేషిస్తారో, తాను కూడా వారి ఆలోచనా విధానాన్ని అలాగే అర్థం చేసుకున్నానని చెప్పారు. వారి ప్రతి ఎత్తుగడ, ప్రతి కదలిక తనకు బాగా తెలుసని పేర్కొంటూ, ఈ వర్గాల ప్రధాన లక్షణం పిరికితనమేనని తీవ్రంగా ఆరోపించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ, అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, జ్ఞానేష్ కుమార్, అజిత్ దోవల్ వంటి కీలక వ్యక్తుల పేర్లను ప్రస్తావించారు. ఈ రాజకీయ కథనంలో వీరే ప్రతినాయకులని అభివర్ణించారు. కాలక్రమేణా వీరి చుట్టూ ఉన్న అధికారం, రక్షణ వలయం క్రమంగా కుంచించుకుపోతోందని, వారంతా ఇప్పుడు నెమ్మదిగా ఒంటరవుతున్నారని అన్నారు.
ప్రభుత్వ బెదిరింపులకు, చర్యలకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని రాహుల్ తేల్చిచెప్పారు. కావాలంటే ఎంతమందైనా పోలీసులను రంగంలోకి దించాలని, పది, ఇరవై లేదా యాభై వేల మందిని మోహరించాలని సవాలు విసిరారు. నాయకులను, యువతను, చివరికి తమను ఎందరినైనా అరెస్టు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అయినప్పటికీ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదన్నారు.
దేశాన్ని అన్ని వైపుల నుంచి తాము చుట్టుముట్టామని, పోరాటం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రాహుల్ ఉద్ఘాటించారు. ఈ పోరాటానికి అవసరమైన సమగ్ర సమాచారం ఇప్పటికే తమ వద్ద సిద్ధంగా ఉందని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని, దేశ ప్రజల గొంతుకను ఏ ధర చెల్లించైనా కాపాడుకుంటామని శపథం చేశారు. గడచిన దశాబ్ద కాలంలో దేశానికి జరిగిన నష్టం మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
నిరసనలు తెలుపుతున్న భారత యువతను చూసి గర్విస్తున్నానని రాహుల్ అన్నారు. యువత తమ నిరసనలను మరింత ధైర్యంగా కొనసాగించాలని కోరారు. తాము ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వాన్ని, రాజ్యాంగంపై దాడి చేస్తున్న శక్తులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఓడించి తీరుతామని ఆయన పునరుద్ఘాటించారు.