చైనాలో విదేశీ ప్రయాణాలపై కొత్త ఆంక్షలు.. మూడేళ్ల వరకు నిషేధం

చైనాలో పౌరుల విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు మరింత కఠినమవుతున్నాయి. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలకు ముప్పు కలిగించే చర్యలకు పాల్పడినట్లు భావించే పౌరులను గరిష్ఠంగా మూడేళ్ల వరకు దేశం విడిచి వెళ్లకుండా నిషేధించే నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తోంది.

కొత్త నిబంధనల ప్రకారం పారిశ్రామిక, సాంకేతిక భద్రతకు ముప్పుగా భావించే వ్యక్తులు, కార్యకలాపాలు కూడా ప్రయాణ ఆంక్షల పరిధిలోకి వస్తాయి. విదేశాల్లో ఉన్న సమయంలో చైనా జాతీయ భద్రత లేదా ప్రయోజనాలకు హాని కలిగించారని అధికారులు భావించినా, వారు తిరిగి దేశానికి వచ్చిన తర్వాత విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది.

ఇప్పటివరకు సాధారణ నేరాలు, భద్రతా అంశాలకు సంబంధించిన కేసులకే పరిమితమైన ప్రయాణ ఆంక్షలను ఇప్పుడు సాంకేతిక, పారిశ్రామిక భద్రత అంశాలకు కూడా విస్తరించడం గమనార్హం. జాతీయ భద్రత పేరుతో విదేశీ ప్రయాణాలపై నియంత్రణను పెంచే దిశగా చైనా తీసుకున్న తాజా చర్యగా ఇది చర్చనీయాంశంగా మారింది.