టీమిండియాలో చోటు కోసం పోటీ పడుతున్న పేసర్ ముకేశ్ కుమార్‌కు ఇంగ్లాండ్ నుంచి అవకాశం దక్కింది. ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లోని నాటింగ్‌హామ్‌షైర్ జట్టుతో ఈ సీజన్‌లోని చివరి రెండు మ్యాచ్‌లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో భారత్ వెలుపల తొలిసారి ఓ దేశవాళీ జట్టుకు ముకేశ్ ప్రాతినిధ్యం వహించనున్నాడు.
బిహార్‌కు చెందిన ముకేశ్ దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ తరఫున ఆడుతున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 233 వికెట్లు పడగొట్టిన అతడు 21.79 సగటును నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు టెస్టులతో పాటు అన్ని ఫార్మాట్లలో కలిపి 26 మ్యాచ్‌లు ఆడిన ముకేశ్.. టీమిండియా తరఫున 32 వికెట్లు సాధించాడు.
2024 జనవరిలో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ముకేశ్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ కాగా, ముకేశ్ 2/0 గణాంకాలు నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాటింగ్‌హామ్‌షైర్ తరఫున కౌంటీ క్రికెట్‌లో లభించిన ఈ అవకాశం ముకేశ్‌కు మరింత అనుభవాన్ని అందించనుంది.