బ్రిటిష్ పాలనలో 1902 సెప్టెంబర్ 12న మద్రాసు నుంచి బాంబే వైపు ప్రయాణికులతో బయలుదేరిన మెయిల్ రైలు ఆంధ్రప్రదేశ్‌లోని అప్పటి ఉమ్మడి కడప జిల్లా ముద్దనూరు మండలం మంగపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. భారీ వర్షాలతో మంగపట్నం సమీపంలోని రైల్వే వంతెన వరద నీటికి కొట్టుకుపోయింది. వంతెన దెబ్బతిన్న విషయం తెలియక అదే మార్గంలో వచ్చిన రైలు పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది యూరోపియన్లు, 61 మంది భారతీయులు సహా మొత్తం 71 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చారిత్రక వివరాలు చెబుతున్నాయి. ఈ ఘటనకు నేటితో 124 ఏళ్లు పూర్తయ్యాయి.
ప్రమాదంలో మృతుల అంత్యక్రియలను ఘటనా స్థలంలోనే నిర్వహించి, వారి జ్ఞాపకార్థం స్మారక స్తూపాన్ని నిర్మించారు. మృతుల్లో బెంగళూరులోని కార్మెలైట్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ థెరెసా (CSST) సంస్థకు చెందిన మదర్ థెరెసా సెయింట్ రోజ్ ఆఫ్ లీమా కూడా ఉన్నారు. ఆమె సేవలను గుర్తిస్తూ 2003లో మంగపట్నం వద్ద ఆంగ్ల మాధ్యమ పాఠశాల, వైద్యశాలను ఏర్పాటు చేసినట్లు స్థానిక వివరాలు పేర్కొంటున్నాయి. అనంతరం 2021లో కేంద్ర పోస్టల్ శాఖ ఆమె జ్ఞాపకార్థం ప్రత్యేక పోస్టల్ కవర్‌ను విడుదల చేసింది.
చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ రైలు ప్రమాద స్మారక స్తూపం గండికోట జలాశయం బ్యాక్‌వాటర్‌లో కొంతకాలం ముంపునకు గురైంది. ప్రస్తుతం నీటి ఉద్ధృతి తగ్గడంతో స్తూపం బయటపడింది. 120 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ స్మారక చిహ్నాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసి, ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రమాదం, దాని జ్ఞాపకార్థం నిర్మించిన స్మారక స్తూపం నేటికీ రైల్వే చరిత్రలోని ఒక విషాద ఘటనను గుర్తుచేస్తున్నాయి.