కేసీఆర్ హయాంలో ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపిస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త సమస్యలను సృష్టిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఉపశమనం కంటే ఇబ్బందులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ప్రజాపాలన పేరుతో తెలంగాణలో భూదోపిడీకి ప్రభుత్వం తెరలేపుతోందని, ప్రభుత్వ నిర్ణయాల వల్ల సామాన్యులు నష్టపోతున్నారని మండిపడ్డారు.
ముఖ్యంగా 22-A భూముల అంశంపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారని, అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. ప్రజల సొంత భూములు, కాలనీలు, అపార్ట్మెంట్లు, గ్రామాలు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయని ఆరోపించారు.
తమ భూముల విషయంలో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం మాత్రం వాస్తవ పరిస్థితులను ప్రజలకు వెల్లడించకుండా దాచిపెడుతోందని విమర్శించారు. భూముల విషయంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.