భూ రికార్డుల నిర్వహణను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్’ మూడో విడత (DILRMP 3.0) ఆపరేషనల్ మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం అధికారికంగా విడుదల చేశారు.
2026-31 కాలానికి అమలు చేయనున్న ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.565.5 కోట్లను కేటాయించింది. భూ రికార్డుల నిర్వహణలో డిజిటల్ విధానాలను మరింత విస్తరించడం, ప్రక్రియలను సులభతరం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉంది.
భూ రికార్డుల డిజిటలైజేషన్ ద్వారా పారదర్శకతను పెంచడంతో పాటు రికార్డుల నిర్వహణ, అందుబాటులోకి తీసుకురావడంలో వేగం పెంచేందుకు DILRMP 3.0 ద్వారా చర్యలు చేపట్టనున్నారు. దీనివల్ల భూ సంబంధిత సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని కేంద్రం భావిస్తోంది.