భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ తదుపరి దశకు సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2026లో మంగళవారం ఆయన ప్రసంగించారు. గత దశాబ్ద కాలంలో దేశ ఫిన్‌టెక్ ప్రయాణం ఎంతో ప్రత్యేకంగా సాగిందని పేర్కొన్నారు. డిజిటల్ పరివర్తనలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని, ప్రస్తుతం భారత్ అవసరమైన స్థాయి, విస్తృతి, ప్రజలందరికీ అందుబాటు వంటి అంశాలను సాధించిందని తెలిపారు.
గత పదేళ్లలో ఫిన్‌టెక్ రంగం వేగంగా అభివృద్ధి చెందడంతో గతంలో అధికారిక ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉన్న కోట్లాది మంది ప్రజలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చారని మోదీ అన్నారు. పదేళ్ల క్రితం బ్యాంకింగ్ సేవలు ప్రజల చేతివేళ్ల వద్దకు వస్తాయని చెప్పినప్పుడు చాలామంది అది సాధ్యమేనా అని భావించారని గుర్తుచేశారు. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు ప్రజల రోజువారీ జీవితంలో భాగమయ్యాయని పేర్కొన్నారు.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ను మరింతగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ సూచించారు. యూపీఐ కారణంగా భారతీయులు ఆర్థిక సేవలను వినియోగించే విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు. భారత్ అభివృద్ధి ప్రయాణంతో యూపీఐ విడదీయరాని సంబంధాన్ని ఏర్పరచుకుందని పేర్కొంటూ, డిజిటల్ ఇండియా విజయగాథను తదుపరి దశకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందని అన్నారు.