బీసీసీఐ కీలక ప్రకటన.. క్యాంపా, ఎస్‌బీఐ లైఫ్‌, చాట్‌జీపీటీతో భారీ డీల్‌

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. టీమిండియా స్వదేశీ క్రికెట్‌ సీజన్‌కు క్యాంపా, ఎస్‌బీఐ లైఫ్‌, చాట్‌జీపీటీ సంస్థలను అసోసియేట్‌ పార్ట్‌నర్లుగా ప్రకటించింది. రెండు సీజన్ల పాటు కొనసాగనున్న ఈ భాగస్వామ్యం భారత్‌–వెస్టిండీస్‌ సిరీస్‌తో ప్రారంభమై 2028 మార్చి వరకు అమల్లో ఉండనుంది. ఈ మూడు ఒప్పందాల ద్వారా బీసీసీఐకి రూ.130 కోట్లకు పైగా ఆదాయం సమకూరనున్నట్లు తెలిపింది.

గత సైకిల్‌తో పోలిస్తే తాజా డీల్‌ విలువ ఏకంగా 44 శాతం పెరిగినట్లు బీసీసీఐ వెల్లడించింది. పానీయాలు, బీమా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ రంగాలకు చెందిన ఈ మూడు సంస్థలతో భాగస్వామ్యం భారత క్రికెట్‌ మార్కెట్‌ స్థాయిని మరోసారి చాటిచెప్పింది. భారీ అభిమాన వర్గాన్ని కలిగి ఉన్న భారత క్రికెట్‌ వేదికను తమ బ్రాండ్‌ ప్రచారానికి ఉపయోగించుకునే అవకాశం భాగస్వామ్య సంస్థలకు లభించనుంది.

ఈ భాగస్వామ్యాలపై బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌ సంతోషం వ్యక్తం చేశారు. భారత స్వదేశీ క్రికెట్‌ సీజన్‌ దేశంలో అత్యంత విలువైన, డిమాండ్‌ ఉన్న క్రీడా వేదికల్లో ఒకటిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. క్యాంపా, ఎస్‌బీఐ లైఫ్‌, చాట్‌జీపీటీ వంటి విభిన్న రంగాల ప్రముఖ సంస్థలు భాగస్వాములుగా చేరడం భారత క్రికెట్‌ వ్యవస్థపై ఉన్న నమ్మకానికి, దాని వాణిజ్య బలానికి నిదర్శనమని ఆయన అన్నారు.