తెలంగాణలో ఎమర్జెన్సీని తలపించే పాలన.. గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన కేటీఆర్‌

తెలంగాణలో ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పులో పడిందని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం కేటీఆర్‌ నాయకత్వంలో సెప్టెంబర్‌ 9న లోక్‌ భవన్‌లో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను కలిసింది. ఈ సందర్భంగా అసెంబ్లీ, పోలీసుల తీరుపై 13 పేజీల ఫిర్యాదు లేఖను గవర్నర్‌కు అందజేశారు.

రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతోందని కేటీఆర్‌ ఆరోపించారు. యూరియా కొరత, రైతు భీమా, ఉద్యోగాల భర్తీ, పాలిటెక్నిక్‌ విద్యార్థుల సమస్యలు సహా పలు అంశాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అసెంబ్లీకి బ్లాక్‌ టీ షర్టులతో వెళ్తున్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారని, మహిళా నేతల పట్ల కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. తమపై దాడులు చేసి తిరిగి తమపైనే కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.

అసెంబ్లీ పరిధిలో చోటుచేసుకున్న పరిణామాలు, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వద్ద జరిగిన ఘటనలను కూడా గవర్నర్‌కు వివరించినట్లు కేటీఆర్‌ తెలిపారు. శాసనసభను దుష్యాసన సభగా మార్చారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వెలుపల జరిగిన ఘటనలపై సీఎస్‌, డీజీపీతో మాట్లాడతానని గవర్నర్‌ హామీ ఇచ్చినట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు మంచివి కావని గవర్నర్‌ తమతో చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.