జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యక్రమాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీ యువజన విభాగానికి ‘జై కొట్టు’ అనే పేరును ఖరారు చేసి, కొత్త లోగోను ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ‘జై కొట్టు’ లోగోతో పాటు నేపథ్య గేయాన్ని కూడా ఆవిష్కరించారు.
యువజన విభాగం ఆవిష్కరణ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. పార్టీ కార్యక్రమాల్లో యువతను మరింత చురుగ్గా భాగస్వామ్యం చేయడంతో పాటు, వారికి కీలక బాధ్యతలు అప్పగించడమే లక్ష్యంగా ఈ కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. యువతకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించేందుకు ‘జై కొట్టు’ వేదికగా నిలవనుందని పేర్కొన్నారు.
ఇక ‘జై కొట్టు’ యువజన విభాగం నేపథ్య గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ గీతానికి సంబంధించిన వీడియోను విడుదల చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ కొత్త విభాగంపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.