తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కలకలం.. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై నేడు కీలక నిర్ణయం?

తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే విషయంపై ఏఐసీసీ అధిష్ఠానం నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్ పార్టీ ముఖ్య నేతలతో వరుసగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉదయం 11 గంటలకు కేసీ వేణుగోపాల్‌తో సమావేశం కానున్నారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఆయనతో భేటీ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం కేసీ వేణుగోపాల్‌ను కలిసి ఈ అంశంపై చర్చించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మరోవైపు తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ మల్లు రవి ఈ వ్యవహారంపై తన సిఫార్సులతో కూడిన నివేదికను ఇప్పటికే ఏఐసీసీ అధిష్ఠానానికి పంపినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘనలకు సంబంధించి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని నివేదికలో సిఫార్సు చేసినట్లు సమాచారం. దీంతో కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంలో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్కంఠ నెలకొంది.