నేపాల్ వరదల్లో ఏపీ యాత్రికులు.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు

నేపాల్‌లో మెరుపు వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకోగా.. నలుగురు యాత్రికులు సురక్షితంగా ఉన్నట్లు, మరో ముగ్గురి ఆచూకీ ఇంకా లభించలేదని ఏపీ ఢిల్లీ భవన్ అధికారులు తెలిపారు. ఆచూకీ లభించని వారిలో కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్‌కు చెందిన శశికుమార్‌, రాజ్యలక్ష్మి ఉన్నట్లు వెల్లడించారు.

ఆచూకీ లభించని ముగ్గురి కోసం కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈషా ఫౌండేషన్‌కు చెందిన శశికుమార్‌ చివరిసారిగా చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద కనిపించినట్లు అధికారులు తెలిపారు. ఆయనను గుర్తించేందుకు చైనా, నేపాల్ అధికారులతో సమన్వయం కొనసాగించాలని సూచించారు.

ఇక కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రి సహా మరో ముగ్గురు యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సురక్షితంగా ఉన్న వారిని వీలైనంత త్వరగా అక్కడి నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టాలని లోకేష్ ఆదేశించారు. భారత రాయబార కార్యాలయం, చైనా, నేపాల్ ఎంబసీలు, గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ సెంటర్‌, ఈషా ఫౌండేషన్ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ తాజా సమాచారాన్ని సేకరించాలని సూచించారు.