హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఎన్జీవోలు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ధర్నా అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు కలెక్టరేట్ నుంచి పాలిటెక్నిక్ కాలేజీ వైపు బయలుదేరారు. అయితే ఆయనను పోలీసులు మార్గమధ్యలో అడ్డుకున్నారు. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు హరీశ్ రావును అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం హరీశ్ రావును హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో కలెక్టరేట్ పరిసరాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.