విద్యార్థులతో కలిసి శాంతియుత నిరసనలకు మద్దతు ఇస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని బీజేపీ నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలకే కాకుండా సొంత పార్టీ నేతలకు కూడా నమ్మకం పోయిందని విమర్శించారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూడటం సరికాదని బీజేపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా నిలుస్తూ శాంతియుతంగా నిరసన చేపట్టాలని భావిస్తే హౌస్ అరెస్ట్లు చేయడం, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు దీక్షలు చేపడతామంటే అనుమతులు ఇవ్వకపోవడం ఏమిటని నిలదీశారు.
అమెరికాలో దేశ విద్రోహ శక్తులను కలిసేందుకు అనుమతులు ఇవ్వాలని చెప్పే ప్రభుత్వం.. సొంత రాష్ట్రంలో విద్యార్థుల నిరసనలకు మద్దతు ఇస్తామంటే ఎందుకు అడ్డుకుంటోందని బీజేపీ నేతలు ప్రశ్నించారు. రాంచందర్ రావుతో పాటు పార్టీ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు.