ఆర్టీజీఎస్‌పై సీఎం సమీక్ష.. సేవల డెలివరీలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశం

సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వివిధ శాఖల పనితీరు, పురోగతిని పరిశీలించారు. ప్రభుత్వ శాఖల మధ్య డేటా సమన్వయాన్ని మరింత పెంచడంతో పాటు ప్రజలకు అందించే సేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, సమర్థవంతంగా ప్రజలకు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని సీఎం సూచించారు. వివిధ శాఖల మధ్య సమాచార మార్పిడి, డేటా సమన్వయం మెరుగుపడితే సేవల డెలివరీ మరింత వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్‌ ‘మనమిత్ర’ ద్వారా అందిస్తున్న 1,204 సేవలపై కూడా సీఎం సమీక్షించారు. ఈ సేవలకు సంబంధించిన డేటా ఎంట్రీ ప్రక్రియను మరింత సరళీకృతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా, వేగంగా అందేలా అవసరమైన మార్పులు చేపట్టాలని స్పష్టం చేశారు.