కాబోయే తండ్రులూ జాగ్రత్త.. బిడ్డ ఆరోగ్యంపై మీ జీవనశైలి ప్రభావం ఉండొచ్చు!

గర్భధారణకు ముందు తల్లి ఆరోగ్యంతో పాటు తండ్రి ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని తాజా సమీక్ష సూచిస్తోంది. Men’s Health జర్నల్‌లో ప్రచురితమైన ఈ సమీక్ష ప్రకారం.. కాబోయే తండ్రి శారీరక, మానసిక ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, మద్యపానం, పొగాకు వినియోగం, జీవనశైలి వంటి అంశాలు భవిష్యత్‌లో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉండే అవకాశం ఉంది.

గర్భధారణకు ముందు తండ్రుల ఆరోగ్యానికి సంబంధించి గతంలో నిర్వహించిన పలు అధ్యయనాలను పరిశోధకులు సమీక్షించారు. తండ్రి ఆరోగ్య పరిస్థితులు, పిల్లల ఆరోగ్య ఫలితాల మధ్య సంబంధం ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో గుర్తించినట్లు తెలిపారు. ముఖ్యంగా మద్యపానానికి సంబంధించి కొన్ని పరిశోధనలు ఆందోళనకర అంశాలను సూచిస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. తండ్రి మద్యపానం వల్ల కొన్ని పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదం 35 శాతం వరకు పెరిగినట్లు గుర్తించారు.

అయితే ఈ ఫలితాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని పరిశోధకులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న చాలా అధ్యయనాలు పరిశీలనా ఆధారితమైనవే కావడంతో.. తండ్రి జీవనశైలి, బిడ్డ ఆరోగ్య సమస్యల మధ్య నేరుగా కారణ-ఫలిత సంబంధం ఉందని నిర్ధారించలేమని తెలిపారు. అయినప్పటికీ గర్భధారణకు ముందు ఆరోగ్యకరమైన ఆహారం, పొగాకు-మద్యపానానికి దూరంగా ఉండటం, శారీరకంగా చురుకుగా ఉండటం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం కాబోయే తండ్రులకు ప్రయోజనకరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు.