H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? స్వైన్‌ ఫ్లూపై ICMR కీలక ప్రకటన

కరోనా మహమ్మారి రోజులను గుర్తుచేసుకుంటేనే చాలామందిలో ఆందోళన మొదలవుతుంది. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో H1N1 స్వైన్‌ ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో.. మరో కొత్త వేరియంట్ వచ్చిందా అనే ప్రచారం జరుగుతోంది. అయితే భారతదేశంలో H1N1కి సంబంధించి కొత్త స్ట్రెయిన్‌ ఏదీ గుర్తించలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) స్పష్టం చేసింది. ప్రస్తుతం పెరుగుతున్న కేసులు సీజనల్‌ ఇన్‌ఫ్లుయెంజా కారణంగానేనని తెలిపింది.

ICMR శాస్త్రవేత్తల ప్రకారం.. ప్రస్తుతం భారత్‌లో వ్యాప్తిలో ఉన్న H1N1 వైరస్‌ 2025 నుంచి చలామణిలో ఉన్న స్ట్రెయిన్‌కు చెందినదే. అంతేకాకుండా, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌ రకాలు ఉత్తరార్ధగోళం కోసం సిఫారసు చేసిన ఫ్లూ వ్యాక్సిన్‌ స్ట్రెయిన్‌లతో బాగా సరిపోతున్నాయని వెల్లడించారు. కాబట్టి ఇది కరోనా సమయంలో మాదిరిగా కొత్త వైరస్‌ లేదా కొత్త మహమ్మారి పరిస్థితికి సంకేతమని చెప్పడానికి ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

అయితే H1N1ను పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపించవచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో సమస్యలు తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో జాగ్రత్త అవసరం. లక్షణాలు తీవ్రంగా ఉంటే స్వయంగా మందులు వేసుకోకుండా వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.