హైదరాబాద్‌లో ఆహార భద్రతపై టీజీ సేఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. కమిషనర్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ, పోలీసు సిబ్బందితో కూడిన 10 ప్రత్యేక బృందాలు నగరంలోని క్యూఆర్‌ఈ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు చెందిన మొత్తం 20 డార్క్ స్టోర్లను అధికారులు తనిఖీ చేశారు.
స్టోర్లలో ఆహార పదార్థాల నిల్వ, పరిశుభ్రత, నిర్వహణకు సంబంధించిన నిబంధనలను అధికారులు పరిశీలించారు. తనిఖీల సందర్భంగా పలు స్టోర్లలో పరిశుభ్రత ప్రమాణాల నిర్వహణలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఆహార పదార్థాలను సరైన విధానంలో నిల్వ చేయకపోవడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు అందుబాటులో ఉండటం వంటి ఉల్లంఘనలు కూడా అధికారుల దృష్టికి వచ్చాయి.
ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించిన స్టోర్ల యాజమాన్యాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించిన ఆహార పదార్థాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించారు. వినియోగదారులకు సురక్షితమైన ఆహారం అందేలా చూడటమే లక్ష్యంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు ఇకపై కూడా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.