అనకాపల్లి కేవలం బెల్లానికి మాత్రమే ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా కాకుండా, రాబోయే రోజుల్లో దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ హబ్‌గా ఆవిర్భవిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తే అదే తమకు అసలైన తృప్తినిస్తుందని పేర్కొన్నారు. సమాజానికి మేలు చేసే ప్రతి పనిలోనూ సవాళ్లు, విమర్శలు సహజమేనని, అయితే అభివృద్ధి ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోమని స్పష్టం చేశారు.
విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ వస్తే నీటి ఎద్దడి ఏర్పడుతుందంటూ కొందరు చేస్తున్న ప్రచారాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. డేటా సెంటర్ ఇంకా ప్రారంభం కాకముందే నీళ్లు ఇంకిపోయాయని ప్రచారం చేయడం వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు త్వరలోనే గోదావరి జలాలను తరలిస్తామని హామీ ఇచ్చారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా గోదావరి జలాల తరలింపు పనులను వేగవంతం చేస్తామని చంద్రబాబు తెలిపారు. సెప్టెంబర్ తొలి వారంలోనే ఈ పనులను పూర్తి చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు అమరావతికి అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతికత రావడం రాష్ట్రానికే గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. మంచి పనులను అడ్డుకోవాలని చూసే విమర్శలను పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని సీఎం స్పష్టం చేశారు.