మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే కొంతకాలంగా ఈ సినిమాపై పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నేచురల్ స్టార్ నానితో ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో చిరంజీవి సినిమా ఆలస్యం అవుతోందని, చివరకు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. దర్శకుడు కథ చెప్పడం లేదని, దీంతో మెగాస్టార్ ఈ సినిమాను క్యాన్సిల్ చేశారనే రూమర్స్ కూడా వినిపించాయి.
అయితే తాజాగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శ్రీకాంత్ ఓదెల చేసిన సోషల్ మీడియా పోస్ట్‌తో ఈ ప్రచారానికి చెక్ పడినట్లైంది. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాంత్ ఓదెల.. ఆయనతో సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. దీంతో చిరంజీవి–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లోని సినిమా ఆగిపోలేదనే విషయం స్పష్టమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు.. ఆ సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే అవకాశం ఉంది.
ఇక ఈ మెగా ప్రాజెక్ట్‌ను పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నట్లు గతంలో నిర్మాత సుధాకర్ చెరుకూరి వెల్లడించారు. 1970ల కాలం నేపథ్యంలో, ముఖ్యంగా 1974-75 తర్వాత జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా కథను రూపొందిస్తున్నట్లు సమాచారం. గతంలో విడుదలైన సినిమా లుక్స్‌లో చిరంజీవి గెటప్ కూడా ఆసక్తిని రేకెత్తించింది. దీంతో ‘ది ప్యారడైజ్’ తర్వాత శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించనున్న చిరంజీవి సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.