పండుగల వేళ షుగర్ ధరలకు బ్రేక్.. 10 లక్షల టన్నుల చక్కెర దిగుమతికి కేంద్రం అనుమతి

దేశంలో చక్కెర ధరలు భారీగా పెరుగుతున్నాయి. వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగలు సమీపిస్తున్న వేళ పంచదార ధర కిలోకు రూ.65 వరకు చేరింది. మహారాష్ట్రలో ఎక్స్‌-మిల్ చక్కెర ధరలు కూడా క్వింటాల్‌కు రూ.5,400 నుంచి రూ.5,560కి పెరిగాయి. దేశీయంగా చక్కెర నిల్వలు తగ్గిపోవడం, వ్యాపారులు పెద్ద మొత్తంలో కొనుగోళ్లకు సిద్ధపడటంతో ధరలపై మరింత ఒత్తిడి ఏర్పడింది.

ధరల పెరుగుదలతో వినియోగదారులపై భారం పెరిగే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారిగా చక్కెరను దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. ఇందులో భాగంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

దేశీయ మార్కెట్లో చక్కెర లభ్యతను పెంచడం, ధరలను నియంత్రించడం, పండుగల సమయంలో వినియోగదారులపై భారం తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. దిగుమతులు ప్రారంభమైతే మార్కెట్లో చక్కెర సరఫరా పెరిగి ధరలు కొంతవరకు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. పండుగల సీజన్‌లో చక్కెర ధరల పెరుగుదలతో ఆందోళన చెందుతున్న వినియోగదారులకు కేంద్ర నిర్ణయం ఊరటనిచ్చే అవకాశం ఉంది.