TS Inter 2026: ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాస్ సర్టిఫికెట్ల పంపిణీ ప్రారంభం

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి మార్చి-2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మే-2026 అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జనరల్, ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్ల ముద్రణ ప్రక్రియను బోర్డు విజయవంతంగా పూర్తి చేసింది.

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ విద్యా అర్హతకు సంబంధించిన పాస్ సర్టిఫికెట్ల కోసం ఇకపై ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సంబంధిత కళాశాలలకు సర్టిఫికెట్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో విద్యార్థులు తమ కళాశాలలను సంప్రదించి వాటిని స్వీకరించవచ్చు.

మార్చి-2026 రెగ్యులర్ పరీక్షలతో పాటు మే-2026 అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన జనరల్, ఒకేషనల్ విద్యార్థులు తమ కళాశాల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఉన్నత విద్య, ఉద్యోగాలు తదితర అవసరాలకు ఈ పాస్ సర్టిఫికెట్లు ఉపయోగపడనున్నాయి.