స్టైఫండ్ పెంపు డిమాండ్‌తో సమ్మె చేస్తున్న ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్లతో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. స్టైఫండ్ పెంపు విషయంలో ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమస్యకు తక్షణ పరిష్కారం లభించలేదు. దీంతో జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు.
స్టైఫండ్‌ను 30 శాతం పెంచాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న జూడాలు.. చర్చల సందర్భంగా కనీసం 20 శాతం అయినా పెంచాలని కోరినట్లు తెలిపారు. అయితే 20 శాతం పెంపు కూడా సాధ్యం కాదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేసినట్లు సమాచారం. జూనియర్ డాక్టర్లకు ఏటా 3 శాతం, హౌస్ సర్జన్లకు 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వాలనే ప్రతిపాదనను మంత్రి చేసినట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ వెల్లడించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థికశాఖ అధికారులతో చర్చించిన అనంతరం మరోసారి జూనియర్ డాక్టర్లతో సమావేశమవుతామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సమస్య పరిష్కారం కాకపోవడంతో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు జూడాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.