బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ భారత్ పర్యటనపై అనిశ్చితి నెలకొంది. వచ్చే నెలలో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి ముందు ఆయన భారత్లో పర్యటించే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం ఆ పర్యటనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరిగే బ్రిక్స్ సదస్సుకు రెహమాన్ హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
తారిఖ్ రెహమాన్ భారత్ పర్యటనకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని బంగ్లాదేశ్ విదేశాంగ వ్యవహారాల సలహాదారు హుమాయున్ కబీర్ వ్యాఖ్యానించారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య పరస్పర విశ్వాసం, ఏకాభిప్రాయంతో కూడిన అనుకూల వాతావరణం ఏర్పడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్ నుంచి గౌరవప్రదమైన ఆహ్వానం రావాల్సి ఉందని స్పష్టం చేశారు.
జాతీయ ప్రయోజనాలను స్పష్టంగా నిర్వచించకుండా ఉన్నతస్థాయి పర్యటనను తొందరపెట్టాల్సిన అవసరం లేదని హుమాయున్ కబీర్ తెలిపారు. బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే అంశంపై బంగ్లాదేశ్లో చర్చ కొనసాగుతున్నప్పటికీ.. తుది నిర్ణయంపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో తారిఖ్ రెహమాన్ భారత్ పర్యటన ఉంటుందా లేదా అనే దానిపై మరికొంతకాలం ఉత్కంఠ కొనసాగనుంది.