దేశంలోని గ్రామీణ, మారుమూల, కొండ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలను వేగంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహన అంబులెన్సులకు అధికారికంగా అనుమతి కల్పించే దిశగా అడుగులు వేసింది. ఇందుకోసం ‘కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989’లో అవసరమైన సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
ఇప్పటివరకు కేంద్ర మోటారు వాహనాల నిబంధనల్లో ద్విచక్ర అంబులెన్సులకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు లేవు. దీంతో వాటి రూపకల్పన, నిర్వహణ ప్రమాణాలు, రోగులను సురక్షితంగా తరలించే విధానం, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ తనిఖీలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు అందుబాటులో లేవు. కొత్త సవరణల ద్వారా ఈ అంశాలకు అధికారికంగా మార్గదర్శకాలు రూపొందించేందుకు అవకాశం కలగనుంది.
ద్విచక్ర అంబులెన్సులు రద్దీగా ఉండే ప్రాంతాలు, ఇరుకైన రహదారులు, కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో అత్యవసర సేవలను వేగంగా అందించడంలో ఉపయోగపడే అవకాశం ఉంది. చట్టపరమైన నిబంధనలు అమల్లోకి వస్తే ఈ వాహనాలు ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ పరిధిలోకి రానున్నాయి. దీంతో అత్యవసర వైద్య సేవలు అవసరమైన ప్రజలకు మరింత వేగంగా సహాయం అందే అవకాశం ఉంది.