మంత్రి నారా లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. విద్యార్థుల్లో విలువల పెంపుపై చర్చ

ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మంగళవారం ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుస్తకాల పరిజ్ఞానంతో పాటు విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, మానవీయత, క్రమశిక్షణ, బాధ్యతాయుత పౌరసత్వం వంటి విలువలను పెంపొందించాల్సిన అవసరంపై చర్చించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నైతిక విలువలతో కూడిన విద్య ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.

సమావేశంలో విద్యా రంగంలో నైతిక విలువల ప్రాధాన్యత, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న విలువల ఆధారిత బోధనపై విస్తృతంగా చర్చించారు. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో మంచి ఆలోచనా విధానం, సమాజం పట్ల బాధ్యత, మానవీయ దృక్పథాన్ని పెంపొందించేలా విద్యా విధానం ఉండాలని చర్చించినట్లు తెలిపారు.

భవిష్యత్ తరాలను సన్మార్గంలో తీర్చిదిద్దేందుకు పాఠశాల స్థాయి నుంచే నైతిక విలువలను బోధించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యార్థులలో క్రమశిక్షణ, బాధ్యత, మంచి ప్రవర్తన వంటి లక్షణాలను పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కూడా ఇరువురూ అభిప్రాయాలు పంచుకున్నారు.