వెయిట్ లాస్‌లో ఉడికించిన గుడ్డా.. ఆమ్లెట్టా? నిపుణులు ఏది మంచిదంటున్నారంటే!

గుడ్డును పూర్తి పోషకాహారంగా పరిగణిస్తారు. తక్కువ ఖర్చుతో శరీరానికి అవసరమైన ప్రోటీన్‌తో పాటు పలు పోషకాలు అందించే ఆహారాల్లో ఇది ఒకటి. అందుకే బరువు తగ్గాలని ప్రయత్నించే చాలామంది తమ డైట్‌లో గుడ్డును చేర్చుకుంటారు. అయితే వెయిట్ లాస్ సమయంలో ఉడికించిన గుడ్డు తినడం మంచిదా, ఆమ్లెట్ తీసుకోవడం మంచిదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది.

నిపుణుల ప్రకారం బరువు తగ్గాలనుకునేవారికి ఉడికించిన గుడ్డు మెరుగైన ఎంపికగా ఉంటుంది. ఉడికించడానికి నూనె, వెన్న వంటి అదనపు కొవ్వులు అవసరం ఉండవు. ఒక మీడియం సైజు ఉడికించిన గుడ్డులో సుమారు 70–78 కేలరీలు ఉంటాయి. దీంతో తక్కువ కేలరీలతో మంచి ప్రోటీన్‌ను పొందే అవకాశం ఉంటుంది.

ఆమ్లెట్ కూడా ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కావచ్చు. అయితే దాని తయారీలో ఎక్కువ నూనె, వెన్న లేదా అధిక కేలరీల పదార్థాలు ఉపయోగిస్తే మొత్తం కేలరీలు పెరుగుతాయి. అందువల్ల వెయిట్ లాస్ లక్ష్యంగా ఉన్నవారు ఉడికించిన గుడ్డుకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఆమ్లెట్ తీసుకోవాలనుకుంటే తక్కువ నూనెతో పాటు కూరగాయలను జోడించి తయారు చేసుకోవడం మంచి ప్రత్యామ్నాయం.