పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. క్వెట్టా సమీపంలోని ఓ బొగ్గు గనిలో గురువారం భారీ పేలుడు సంభవించడంతో కనీసం 18 మంది కార్మికులు మృతి చెందారు. మరో 24 మంది కార్మికులు గని లోపల శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గని లోపల భూగర్భంలో అత్యంత ప్రమాదకరమైన మీథేన్ గ్యాస్ పేరుకుపోవడం వల్లే పేలుడు సంభవించినట్లు ప్రభుత్వ గనుల తనిఖీ అధికారి ఘనీ బలోచ్ తెలిపారు. పేలుడు తీవ్రతకు గని కొంత భాగం ధ్వంసం కావడంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఘటన అనంతరం సహాయక బృందాలు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.
గని లోపల పరిస్థితులు ప్రమాదకరంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కార్మికుల భద్రతకు సంబంధించి గనుల్లో నిబంధనల అమలుపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.