శ్రీశైలంలో ‘ప్రజల వద్దకే సమస్యల పరిష్కారం’.. చైర్మన్ రమేష్ నాయుడు వినూత్న కార్యక్రమం

శ్రీశైలంలో దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ప్రజల వద్దకే సమస్యల పరిష్కారం’ పేరుతో క్షేత్ర పరిధిలోని స్థానికులను స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యలపై సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా దేవస్థానంలోని సంబంధిత విభాగాల అధికారులతో కలిసి స్థానిక సిద్ధరామప్ప వాణిజ్య సముదాయాన్ని సందర్శించారు. అక్కడి దుకాణదారులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. దుకాణదారులు పలు సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకురాగా.. ఆయన వెంటనే స్పందించారు.

సిద్ధిరామప్ప వాణిజ్య సముదాయంలో పారిశుద్ధ్య నిర్వహణ, భద్రత, మురుగునీటి పారుదల, వాణిజ్య సముదాయం చుట్టూ ప్రహరీ తరహాలో చైన్‌లింక్ మెష్ ఏర్పాటు వంటి అంశాలను దుకాణదారులు ప్రస్తావించారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులతో చైర్మన్ మాట్లాడి, ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని అక్కడికక్కడే అధికారులకు సూచనలు ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు.