అనుగొండ గ్రామ దాహార్తి తీరింది.. రూ.3 లక్షలతో కాల్వ పూడికతీత పూర్తి

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని అనుగొండ గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. ఎమ్మెల్యే దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తమ సొంత నిధుల నుంచి రూ.3 లక్షలు వెచ్చించి హంద్రీ నది కాల్వ పూడికతీత పనులను పూర్తి చేయించారు. పనులు పూర్తైన అనంతరం హంద్రీ నదికి గంగాజల హారతి ఇచ్చి, కాల్వ ద్వారా అనుగొండ గ్రామానికి నీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కోడుమూరు నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామకృష్ణ రెడ్డి, రవీంద్ర గౌడ్, వర్కూరు గిడ్డయ్యతో పాటు గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. గ్రామానికి తాగునీరు అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.