పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. చాలా రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం భారీ ఊరటనిచ్చింది. గత కొన్ని వారాలుగా వర్షాభావంతో సాగు పనులు నిలిచిపోగా, తాజా వర్షాలతో వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎలినో ప్రభావంతో జిల్లాలో వర్షాలు ఆలస్యమవడంతో వరి నార్లు వేసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొలాలు ఎండిపోవడంతో సాగు పనులు ముందుకు సాగలేదు. అయితే రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో పొలాలు పూర్తిగా తడిసి, వ్యవసాయానికి అవసరమైన తేమ లభించింది.
తాజా వర్షాలతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. వరి నాట్లు వేసేందుకు ఇప్పుడు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా సాగు ప్రారంభించని రైతులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వ్యవసాయ పనులు వేగవంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.