వివాహేతర సంబంధం అనుమానంతో భార్య హత్య.. వీడియో కాల్‌లో చివరి క్షణాలు చూపించిన భర్త

కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన భర్త ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని భాగ్యశ్రీ జిగలూర్‌గా గుర్తించగా, నిందితుడు ప్రవీణ్ జిగలూర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం గలగలి గ్రామంలో జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం, ప్రవీణ్ ముందుగా భాగ్యశ్రీపై కర్రతో దాడి చేసి, అనంతరం ఆమెను హత్య చేశాడు. ఘటన సమయంలో ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి, తీవ్ర కలకలం రేపే దృశ్యాలను చూపించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అలాగే ఆ వీడియోను పలువురికి షేర్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు.

కుటుంబ కలహాల కారణంగా భాగ్యశ్రీ రెండు నెలలుగా పుట్టింట్లో ఉంటున్నట్లు సమాచారం. సమస్యలు పరిష్కరిద్దామని నమ్మించి ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.