జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. నిజామాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న వరంగల్-2 డిపోకు చెందిన బస్సు ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 12 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసి మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.